- భువనగిరి, ఆలేరు కాంగ్రెస్ నేతలు
- కుంభం, ఫైళ్ల ఒక్కటే..గుట్టలు తవ్వడమే వారి వ్యాపారమని ఆరోపణ
యాదాద్రి, వెలుగు: పార్టీ నుంచి ఒక్కరు పోయినంత మాత్రాన నష్టమేమీ లేదని, కాంగ్రెస్‌లో చేరేందుకు ఇతర పార్టీలకు చెందిన ఎంతో మంది లీడర్లు సిద్ధంగా ఉన్నారని యాదాద్రి, ఆలేరు లీడర్లు స్పష్టం చేశారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరిన నేపథ్యంలో మంగళవారం యాదాద్రి డీసీసీలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్కుమార్అధ్యక్షతన భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల నుంచి ముఖ్య నేతలు అత్యవసర మీటింగ్ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా కుంభం పార్టీ మారడంపై చర్చ జరిపారు. అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్య సహా కొందరు లీడర్లు మాట్లాడుతూ ఎప్పుడో వెళ్లిపోవాల్సిన కుంభం ఇప్పుడు వెళ్లాడని కామెంట్ చేశారు.
ALSO READ :ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలి : రోనాల్డ్ రోస్
ఎమ్మెల్యే పైళ్ల, కుంభం వేర్వేరు కాదని, ఇద్దరూ ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. ఇద్దరూ గుట్టలను తొలిచి వ్యాపారం చేసేటోళ్లేనని ఆరోపించారు. కేడర్‌ను కాపాడుకోవడానికి అందరం కలిసికట్టుగా పని చేస్తామని స్పష్టం చేశారు. ఒక్కో పార్లమెంట్‌కు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్లు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని ప్రకటించారు. టికెట్ఆశించే లీడర్లు ఎంతమంది ఉన్నా.. హైకమాండ్ సర్వే నిర్వహించి ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు.
ఇన్విటేషన్ లేకపోవడంతో పలువురు గైర్హాజరు
భువనగిరిలో ఏర్పాటు చేసిన అత్యవసర మీటింగ్కుఇన్విటేషన్ లేకపోవడంతో రెండు నియోజకవర్గాలకు చెందిన పలువురు లీడర్లు హాజరుకాలేదు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్కుడుదుల నగేశ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి, ఎస్సీ సెల్ స్టేట్ లీడర్ నీలం వెంకటస్వామి, కల్లూరి రాంచంద్రారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ సహా భువనగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు లీడర్లు రాలేదు.
డీసీసీ ఎంపికపై కసరత్తు
కొత్తగా డీసీసీ అధ్యక్షుడి ఎంపికపై టీపీసీసీ కసరత్తు మొదలు పెట్టింది. ఎవరిని నియమించాలన్న విషయంపై బుధవారం భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్ సిరిసిల్ల రాజయ్య భువనగిరి రానున్నారు. మీటింగ్‌కు రావాలని ఇప్పటికే ముఖ్య నాయకులను సమాచారం అందింది. అయితే డీసీసీ అధ్యక్షుడి పదవిని ఆలేరు మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి ఆశిస్తున్నారు. అయితే ఎన్నికలు మరో ఐదు నెలలు మాత్రమే ఉండడం, కీలకమైన డీసీసీ పోస్టు భర్తీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నా.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందని పార్టీ లీడర్లు అంటున్నారు.