వరంగల్/సంగెం, వెలుగు : అనేక సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. వరంగల్ జిల్లా సంగెం మండలం గుంటూర్‌పల్లి, కాపులకానిపర్తి, గవిచర్ల గ్రామాల్లో బుధవారం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పంట నష్టపోయిన రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామన్నారు.
ALSO READ: కేసీఆర్‌కు కాంగ్రెస్ భయం పట్టుకుంది: బీర్ల అయిలయ్య
గతంలో బోర్లు వేసినా నీరు పడని భూముల్లో ఇప్పుడు ఊటలు వస్తున్నాయని, వేరే రాష్ట్రాల్లో మాత్రం మంచి నీటి కోసం బిందెలతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో మహిళలకు ఇప్పటికే రూ.22 వేల కోట్ల లోన్లు ఇచ్చామన్నారు. కార్యక్రమంలో వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, జడ్పీటీసీ సుదర్శన్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.