మానవాళి జీవనశైలిని సమూలంగా మార్చి వేసిన నవ్య ఉపకరణాల్లో స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ల్యాబ్ ట్యాబ్స్, పీసీలు, కంప్యూటర్స్, సామాజిక మాధ్యమాలు, రోబోటిక్స్, క్లౌడ్- ఆధారిత వ్యవస్థలు, కృత్రిమ మేధ, ఐఓటీ లాంటి నవ్య సాంకేతిక ఫలాలు మార్కెట్‌ను ముంచేస్తున్నాయి. సామాజిక ఆర్థిక ప్రగతి, ఉత్పత్తుల పెరుగుదల, కనెక్టివిటీ ఊహకందనంత పెరిగి పోయింది.
నేటి డిజిటల్ విప్లవం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. గత కొన్ని దశాబ్దాల్లో పీసీల స్టోరేజ్ కెపాసిటీ, ఉపకరణ సైజుల్లో అనేక రెట్ల మార్పులు చూస్తున్నాం. మూడు దశాబ్దాల క్రితం గ్లోబల్ ఐపీ ట్రాఫిక్ రోజుకు100 జీబీ ఉండగా, నేడు సెకనుకు1.5 లక్షల జీబీలకు చేరింది. కరోనా సంక్షోభం అనంతరం డిజిటలైజేషన్ వేదికగా పరిశ్రమలు, వ్యక్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వాణిజ్యాల ప్రాధాన్యతలు మనం అనుభవిస్తున్నాం.
ఖనిజ వనరుల దోపిడీ
డిజిటల్ ఉపకరణాల ఉత్పత్తికి సంబంధించిన కాలుష్యాన్ని డిజిటల్ పొల్యూషన్‌గా పిలుస్తారు. డిజిటల్ విప్లవం వేదికపైన కనిపిస్తున్న వెలుగులను చూస్తున్న మానవాళి, తెర వెనుక దాగి ఉన్న దుష్ప్రభావాలు, రాబోయే తరాలకు శాపాలుగా మారనున్నాయనే విషయం మరిచిపోతున్నది. వ్యక్తులు, సంస్థలు, సామాజిక వ్యవస్థలు పలు వికృత రూపాలను చూడనున్నాయి. డిజిటల్ పరిశ్రమతో అస్థిరాభివృద్ధి, పర్యావరణ విచ్ఛిన్నత పెనవేసుకున్నాయి. డిజిటల్ టెక్నాలజీ ఉపకరణాల తయారీలో అరుదైన ఖనిజ లోహాలు, ఖరీదైన కోబాల్ట్ లాంటి లోహాలు విచ్చలవిడిగా వాడుతున్నాం. ఈ క్రమంలో పర్యావరణానికి హాని చేయగల హెవీ మెటల్స్, రెడియో ధార్మిక పదార్థాలను విసర్జించడంతో భవిష్యత్తు ఎంతో ప్రమాదకర అనుభవాలను రుచి చూడనున్నాం.
డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు అపార శక్తి వినియోగం, కార్బన్ ఉద్గారాలు పెరగడం, భూతాపం లాంటి ప్రతికూలతలు దాగి ఉన్నాయి. ప్రపంచంలోని 3 శాతం విద్యుత్తును వినియోగిస్తూనే, 2 శాతం గ్రీన్‌హౌజ్ వాయువుల ఉద్గారాలను చేస్తున్నాం. కృత్రిమ మేధా సృష్టి వెనుక దాదాపు 300 టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీ టెక్నాలజీ ఎంతో విద్యుత్తును వినియోగిస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాల దుష్ప్రభావాల కన్నా ఎలక్ట్రానిక్ వ్యర్థాల కాలుష్యం దీర్ఘకాలికంగా ప్రమాదకరమవుతున్నది.
ALSO READ: నిజాంపేటలో కుప్పకూలిన బిల్డింగ్ స్లాబ్
ఈ -వ్యర్థాలు
ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 300 మిలియన్ల డిజిటల్ ఉపకరణాలు, 1 బిలియన్ మొబైల్ ఫోన్లు తయారు అవుతున్నాయని అంచనా. ఇంటర్నెట్ విస్తార వినియోగంతో నేడు 4 శాతం ఉన్న గ్లోబల్ ఎమిషన్స్ 2040 నాటికి 14 శాతం వరకు చేరవచ్చు. డిజిటలైజేషన్ పుణ్యాన ప్రమాదకరమైన ఈ–-వ్యర్థాలు పర్యావరణంలోకి చేరి ప్రమాదకర కాలుష్యాలుగా నిలుస్తున్నాయి. టీవీలు, స్మార్ట్ ఫోన్‌లు, కంప్యూటర్ ఉపకరణాలు, స్మార్ట్ వాచ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తుల్లో ముఖ్యమైన లోహాలు, విద్యుత్తు వినియోగం ఇమిడి ఉంటాయి. వీటిలో 80 శాతం ఈ–-వ్యర్థాలు, 20 శాతం విద్యుత్ వినియోగ కాలుష్యం జనిస్తాయి. కంప్యూటరైజేషన్ పరిశ్రమ దుష్ప్రభావాలుగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణ విచ్ఛిన్నాలుగా మారుతున్నాయి.
ప్రపంచ ఘన వ్యర్థాల్లో 2 శాతం ఈ–-వ్యర్థాలను, 70 శాతం విష వ్యర్థాలను విడుదల చేస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం సాలీనా 50 మిలియన్ టన్నుల ఈ– వ్యర్థాలు విడుదల అవుతున్నాయని తెలుస్తున్నది. వీటిలో గరిష్టంగా 20 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతున్నది. డిజిటల్ విప్లవంతో పరోక్షంగా వినియోగదారులకు కలుగుతున్న అనారోగ్యాలు వెలకట్టలేనివి. నిరంతరం నీలి తెరలను అతుక్కొని ఉంటున్న యువత కంటి జబ్బులు, మానసిక ఒత్తిడి, వ్యసనం, ఒంటరితనం, ఉద్రేకం లాంటి లక్షణాలతో ఇబ్బందిపడుతున్నది. నవ్యత వైపు డిజిటల్ అడుగులు పడుతున్న వేళ సుస్థిరాభివృద్ధి దిశగా, గ్రీన్ వ్యవస్థల స్థాపనలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రపంచ దేశాలు ప్రయాసపడకుంటే డిజిటల్ విప్లవం కాలుష్య విస్తరణ కేంద్రంగా మారుతుందని గమనించాలి. అందుకే సుస్థిరాభివృద్ధి వైపు పటిష్ట అడుగులు వేద్దాం.. స్మార్ట్ డిజిటల్ ఆలోచనలతో స్వచ్ఛతకు పట్టం కడదాం.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి, సోషల్ ఎనలిస్ట్